.
Banff National Park, Alberta, Canada
" ఒకే వరసలో అందంగా పేర్చినట్లున్న పది మంచు శిఖరాలు ... వాటి చెంతనే వున్న లోయలో మెరిసే నీలి కొలను, చూసేకొద్ది చూడాలనిపించే ఈ ప్రకృతి సౌందర్యానికి చిరునామా కెనడాలోని బేన్ఫ్ నేషనల్ పార్కు. ఆరు నెలల పాటు మంచు దుప్పట్లు కప్పుకునే ఈ ప్రదేశం ఆ దేశంలోని ఆల్బార్టా ప్రాంతంలో వుంది" .
Kilimanjaro
"చీకటి ఖండం ఆఫ్రికాలో ఎప్పుడు మంచుతో కప్పివుండే పర్వతమిది. కిలిమంజారో అంటే ... ప్రకాశించే తెల్లని పర్వతమని అర్ధం. దీని ఎత్తు సుమారు 5895 మీటర్లు. ఈ మంచు శ్రేణులపై భూకంపాల వల్ల మూడు భాగాలుగా విడిపోయిన పర్వతాలు కనిపిస్తాయి.
ఈ పర్వతం మీద సగం ఎత్తు వరకు పండ్ల చెట్లూ, వరి, జొన్న, కాఫీ, కూరగాయలు, ఆకుకూరలు ఉంటాయి. ఆ తర్వాత ఎతైన వృక్షాలూ , ఆ పైన ఎడారిలాంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉండదట. ఈ పర్వతం పైనుంచి సూర్యాస్తమయాన్ని చూడటం ' ఓ అందమైన అద్భుతం' . "
hitsujiyama park chichibu japan
"దూరం నుంచి చూస్తే తివాచి పరిచినట్టు కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే... షిబాజకురా పువ్వులు కనిపిస్తాయి. జపాన్ లోని ఛిఛిబుకి సమీపంలో వుంది పార్క్. హిత్సుజియామా కొండపైన ప్రతియేటా ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకే ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. షిబాజకురా అనే పూల మొక్కలు పుష్పించే సమయం అదే మరి. ఈ పూలు ముదురు గులాబీ రంగులోను, తెల్లగానూ ఆ తరువాత లేత గులాబీ రంగులోనూ దర్శనమిస్తాయి. ఈ మొక్కలన్నీ నేలకి కాస్త ఎత్తులో ఉండటం వల్ల పువ్వులన్ని కలసి ఇలా తివాచ్ఛీల్లా పరుచుకుంటాయి."
Fly Geyser, Nevada, USA
"200 డిగ్రీల ఉష్ణోగ్రత వుండే నీరు, నిత్యం సుమారు నాలుగు మీటర్లు ఎత్తున ఎగసిపడుతుంటే ఎలా ఉంటుంది? మనిషి సృష్టించిన ఫావుంటేయిన్ అయితే కృత్రిమ దీపాల వెలుగులతో కృత్రిమంగానే ఉంటుంది. కచ్చితంగా ఇంత అందంగా ఉండదు.
నిజమే, ఇది మనిషి సృష్టించింది కాదు... ప్రకృతి ఒడిలో పుట్టిందే. అమెరికాలోని నెవాడలో వుంది. 1916వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో స్థిరపడాలని కొందరు వచ్చారట. నీటికోసం తవ్వకాలు మొదలుపెడితే వేణ్ణీళ్ళు ఎగసిపడటం మొదలుపెట్టాయట. అవి ఎంతకీ ఆగకపోవడంతో ఇక్కణ్ణుంచి వెళ్లిపోయారట. భూగర్భం నుంచి ఉబికివచ్చే ఈ నీటిలోని ఖనిజాలు, లవణాల కారణంగా క్రమక్రమంగా చుట్టుపక్కల పాముపుట్టల్లా రంగురంగుల దిబ్బలు పెరగటం మొదలైంది. నీటి రంగు మారినప్పుడల్లా ఈ దిబ్బల రంగూ మారుతుంటుంది. నీటిని విరజిమ్మే ఈ బుగ్గను అందరు ఫ్లైయింగ్ గీజర్ అని పిలుస్తారు."
Wildlife Crossings
అడవుల్ని అడ్డంగా నరికేశాం, నిలువుగా రోడ్డు వేసేశాం. ఆపై అడ్డం వచ్చాయని జంతువుల్ని వాహనాలతో తొక్కించేస్తాం!
నిజానికి అడ్డం పడింది ఎవరు?...
జంతువుల ఆవాసాల్లోకి వెళ్ళింది మనం. అడవుల్ని చీల్చింది మనం. జంతువుల దారుల్ని మూసింది మనం. ఫలితంగా రోడ్డు పైకి వచ్చి... వేగంగా ప్రయాణిస్తున్న వాహనాల చక్రాల కింద ఎన్నో జంతువులు ప్రాణాలు విడుస్తున్నాయి.
ఈ పరిస్థితిని మార్చాలని 1950లోనే ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలోచించింది. అడవుల్లో రహదారులకు అడ్డంగా... జంతువులు రాకపోకలు సాగించేందుకుఅనువుగా వైల్డ్ లైఫ్ క్రాసింగులను నిర్మించింది. తరువాత నెథర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్లు కూడా అటవీ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలు నిర్మించాయి. అమెరికా, కెనడాలోని ప్రముఖ జాతీయ పార్కుల్లో కూడా ఇలాంటి వంతెనలు ఇప్పుడున్నాయి. ఎన్నో జంతువులు రోడ్లు దాటటానికి వీటిని వినియోగించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నాయి.
ఇంకా ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఈ ప్రపంచంలో చాలా వున్నాయి. అందులో ఇవి కొన్ని మాత్రమే.
నచ్చితే లైక్ చేయండి.